కనిపించని దీపావళి అమ్మకాలు…

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

కనిపించని దీపావళి అమ్మకాలు
ధరల తగ్గుదలపైనే ఆశలు
ముంబై : ఈ సంవత్సరం ధనత్రయోదశి, దీపావళి పండగలు నగల వ్యాపారులకు పెద్దగా కలిసొచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పసిడి ధర కొద్దిగా తగ్గినా, గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ దాదాపు రూ.5,000 ఎక్కువగా ఉంది. దీంతో ఈ ఏడాది ఈ రెండు పండగల సమయంలో నగల విక్రయాలు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గా ల అంచనా. నెల రోజుల క్రితం పది గ్రాముల మేలిమి బంగారం (24 కేరట్లు) ఒక దశలో రూ.40,000 పలికింది. ప్రస్తుతం రూ.37,500-38,000 మధ్య ట్రేడవుతోంది. సంపన్నులు మినహా మధ్య తరగతి ప్రజలెవరూ ఇంత ధర పెట్టి నగల కొనుగోలుకు ముందుకు రావడం లేదని నగల వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మధ్య తరగతి ఎక్కువగా కొనే నగల అమ్మకాలు బాగా పడిపోయాయి. దీపావళి నాటికి పసడి ధర మరింత తగ్గితే తప్ప, మధ్య తరగతి ప్రజలు నగల కొనుగోలుకు పెద్దగా ముందుకు రాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మందగమనం దెబ్బ
ఆర్థిక మందగమనంతో గత ఏడాదితో పోలిస్తే ప్రజల ఆదాయాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు బాగా తగ్గాయి. ఆ ప్రభావం ఈ సంవత్సరం దీపావళి అమ్మకాలపై తప్పకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2017 జనవరి నుంచి ఈ సంవత్సరం జూన్‌ వరకు పసిడి దిగుమతుల్లో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం, వృద్ధి రేటు నమోదయ్యేది.
ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో మాత్రం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతులు 60 శాతం పడిపోయాయి. నగల కొనుగోళ్లు, పెట్టుబడి లాభాల కోసం బంగారం కొనడం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం.

బాగానే ఉండొచ్చు
కొన్ని రిటైల్‌ నగల దుకాణాలు మాత్రం ఈ సంవత్సరం ధన త్రయోదశి, దీపావళికి నగల అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తగ్గుతున్న ధర, త్వరలో ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్‌ అమ్మకాలు ఇందుకు కలిసొస్తాయని కల్యాణ్‌ జువెలర్స్‌ చైర్మన్‌ టీఎస్‌ కల్యాణ రామన్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన భారీ బోనస్‌ కూడా ఇందుకు దోహదం చేస్తుందని బులియన్‌ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అంతా రూపాయి దయ
మన దేశంలో పసిడి ధర ఏ స్థాయిలో స్థిరపడుతుందనే విషయం డాలర్‌తో రూపాయి మారకం రేటుపై ఆధారపడి ఉంటుంది. నెల రోజుల క్రితం వరకు పరుగెత్తిన పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇప్పుడు కింది చూపులు చూస్తోంది. వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు అమెరికా-చైనా చేస్తున్న ప్రయత్నాలు, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించడం ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు చర్యలతో అమెరికా కరెన్సీ డాలర్‌ మారకం రేటు పెరిగింది. దీంతో డాలర్‌ మారకంలో రూపాయి మళ్లీ 71 స్థాయిని అధిగమించింది. ఇది మరింత పెరిగితే ఆ ప్రభావం పసిడి ధరపైనా పడి దీపావళికి నగల అమ్మకాలను దెబ్బతీసే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వారం ధరలు మరింత దిద్దుబాటుకు లోనైతే నగల రిటైల్‌ అమ్మకాలు కొద్దిగా పెరగొచ్చు. అయినా గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వ్యాపారం 30 శాతం తగ్గుతుంది.

పసిడి ధర ఇప్పటికీ అధికంగానే ఉంది. దీనికి తోడు గత ఏడాది కాలంగా ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలూ కష్టాల్లో ఉన్నాయి. ఫలితంగా ఈ సంవత్సరం దీపావళి బులియన్‌ మార్కెట్‌కు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *