నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం

international అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

విశ్వానికి సంబంధించి సరికొత్త అంశాలను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.

విశ్వం పరిణామక్రమంపై చేసిన పరిశోధనలకు, సుదూరంగా ఉన్న సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని కనిపెట్టినందుకు శాస్త్రవేత్తలు జేమ్స్ పీబుల్స్, మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

ఈ ముగ్గురికీ కలిపి 90 లక్షల క్రోనార్లు (దాదాపు 6.48 కోట్ల రూపాయలు) నగదు బహుమానం లభిస్తుంది.

మంగళవారం స్వీడన్ రాజధానిలోని స్టాక్‌హోంలో జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కార విజేతలను ప్రకటించారు.

విశ్వంలో మన స్థానం గురించి చాలా ముఖ్యమైన విషయాలను వీరి పరిశోధనలు తెలియజేస్తున్నాయని నోబెల్ కమిటీ సభ్యుడు ఉల్ఫ్ డేనియల్సన్ వ్యాఖ్యానించారు. వీరి పరిశోధనల్లో ఒకటి అంతుచిక్కని విశ్వం చరిత్రకు సంబంధించినదని, ఇదెంతో ఆసక్తికరమైనదని ఆయన చెప్పారు.

గ్రహాన్ని కనుగొన్న పరిశోధన “ఈ విశ్వంలో మనం (భూమి) ఒంటరా? విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా” అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేసిందని ఆయన తెలిపారు.
’51 పెగాసి బి’ అనే ఈ గ్రహం మనకు 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహాన్ని మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌ 1995లో కనుగొన్నారు.

కెనడాలో జన్మించిన జేమ్స్ పీబుల్స్ విశ్వం పరిణామక్రమం, విశ్వంలో భూమి స్థానం గురించి పరిశోధనలు చేశారు.

పీబుల్స్ వయసు 84 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం అమెరికా న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో సేవలందిస్తున్నారు.

విశ్వంలో ‘కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్(సీఎంబీ)’ రేడియేషన్ ఉనికి నిజమేనని ఇతర శాస్త్రవేత్తలతో కలిసి జేమ్స్ పీబుల్స్ అంచనా వేశారు.

మహా విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) తర్వాత వెలువడిన ఉష్ణమే(ఆఫ్టర్‌గ్లో) ‘సీఎంబీ రేడియేషన్’. సీఎంబీని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు విశ్వం వయసు, ఆకృతి, విశ్వంలోని వస్తువులను అంచనా వేయగలగుతున్నారు.

“సీఎంబీ రేడియేషన్ను 1965లో కనుగొన్నారు. విశ్వం తన ప్రారంభ దశ నుంచి నేటి వరకు ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో అర్థం చేసుకొనేందుకు సీఎంబీ రేడియేషన్ ఎంతగానో దోహదం చేసింది” అని నోబెల్ భౌతికశాస్త్ర పురస్కార కమిటీ సారథి మాట్స్ లార్సన్ చెప్పారు.

జేమ్స్ పీబుల్స్ సైద్ధాంతిక ఆవిష్కరణలే లేకపోతే దాదాపు గత 20 ఏళ్లలో సీఎంబీ రేడియేషన్‌ అంచనాలతో ఏమీ తెలిసేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
విశ్వంలో దాదాపు 95 శాతం ఉండే అంతుచిక్కని అంశాలైన డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ సిద్ధాంతానికి సంబంధించి కూడా జేమ్స్ పీబుల్స్ విశేషమైన పరిశోధనలు చేశారు.

విశ్వంలో సాంద్రతలో మార్పుల నుంచి నక్షత్ర మండలాలు, ఇతర భారీ ఖగోళ నిర్మాణాలు ఎలా ఏర్పడ్డాయో వివరించే సిద్ధాంతం అభివృద్ధిలోనూ ఆయన పాత్ర ఉంది.

మీ పరిశోధనల్లో అత్యంత ప్రధానమైనది ఏదని జేమ్స్ పీబుల్స్‌ను అడగ్గా- ఇది చెప్పడం కష్టమని ఆయన బదులిచ్చారు. తన పరిశోధనలు ఒకదానికొకటి ముడిపడినవని తెలిపారు. ఇవి జీవితకాలం సాగించిన పరిశోధనలని ఆయన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

‘రేడియల్ వెలాసిటీ టెక్నిక్’తో మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్ నాడు 51 పెగాసి బి గ్రహాన్ని గుర్తించారు.

తన చుట్టూ తిరుగుతున్న గ్రహపు గురుత్వాకర్షణ శక్తికి లోనైనప్పుడు మాతృ నక్షత్రం స్పందించే తీరు ఆధారంగా సుదూర లోకాల ఆచూకీని ఈ టెక్నిక్‌తో గుర్తిస్తారు.

మిచెల్ మేయర్ వయసు 77 ఏళ్లు కాగా, డిడియర్ క్యులోజ్‌కు 53 సంవత్సరాలు.

51 పెగాసి బి గ్రహాన్ని కనుగొన్నప్పుడు వీరిద్దరూ స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. మిచెల్ మేయర్ ప్రస్తుతం అక్కడే ప్రొఫెసర్ ఎమిరిటస్‌గా ఉన్నారు.

డిడియర్ క్యులోజ్ జెనీవా విశ్వవిద్యాలయంతోపాటు బ్రిటన్లోని యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *