గోదావరి వరద ఉధృతి

ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి

గోదావరి వరద ఉధృతి భద్రాచలం వద్ద తగ్గుముఖంపట్టగా ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులోనే ఉంది. ఉధృతి తగ్గకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తివేశారు. సముద్రంలోకి బ్యారేజీ నుంచి 10.34 లక్షల క్యూసెక్కుల నీటిని విడదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలోనే కొనసాగుతున్నాయి. అయినవిల్లి, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు వరద నీటితో అవస్థలు పడుతున్నారు. సోమవారం రాత్రితో పోలిస్తే మంగళవారం అయినవిల్లి మండలంలోని అయినవిల్లి లంక, తదితర గ్రామాల్లో వరద నీటి ఉదృతి కొంతమేర తగ్గింది. వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు అనేక ఇబ్బందులను పడుతున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఆందోళన చెండుతున్నారు. అయినవిల్లి, అయినవిల్లి లంక, లంక ఆఫ్‌ ఠానేలంక, గురజాపు లంక, ములకల లంకలలోనూ, అమలాపురం మండలంలోని బోడసకుర్రు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో విష పురుగులు, పాములు వచ్చి చేరుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే పాములు పట్టుకునేవారు ఆయా గ్రామాలకు వచ్చి పాములను పట్టుకుంటున్నారు. ఉప్పలగుప్తం మండలంలోని పలు గ్రామాల్లో స్నేక్‌ క్యాచర్‌ గణేష్‌ వర్మ 12 పాములను పట్టుకుని దూరంగా విడిచిపెట్టారు. అయినవిల్లి, ఐ పోలవరం మండలంలని పలు గ్రామాల్లో నిత్యావసర వస్తువులు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల్లోకి అధికారులు వెళ్లకపోవడంతో నిత్యావసర వస్తువులు అందడం లేదని విమర్శిస్తున్నారు. లంక ఆఫ్‌ ఠానేలంక, అయినివల్లి లంకలలో గోదావరి ఉధృతి తగ్గింది. బుధవారం నాటికి మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలోని ఎ వీరవరం, దేవీపట్నం, ఊడిపల్లి, పోచమ్మ గండి వంటి గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నాలుగు రోజులుగా ఈ గ్రామాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు డాబాలపైకి ఎక్కి తలదాచు కుంటున్నారు. మంగళవారం ఏజెన్సీతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత కొద్ది రోజులుగా వాగులు వంకలు పొంగిపొర్లడంతో మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి.
మంత్రి విశ్వరూప్‌ పర్యటన
కోనసీమలోని వరద తాకిడి ఉన్న మండలాల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మంగళవారం పర్యటించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లంకల్లో ఉన్న బాధితులకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని, పక్కా గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *